Pravachanam Quotes

Sri Gurubhyo Namaha


అమృత వాక్యాలు:

💎దేవతలు ఏదో ఇస్తారని కాదు, ఎన్నో ఇచ్చారు కాబట్టి పూజించాలి.
💎జ్ఞానులమని కాసింత అధికారము,ధనము,విద్య ఏది లభించినా అహంకరించే వారు భగవంతుని పొందలేరు. అహంకారానికి, అనుగ్రహానికి ఆమడ దూరం. అహంకారం అణిగితే కానీ అనుగ్రహం రాదు.

💎విగ్రహంపై శిలా దృష్టి, గురువుపై మానుష దృష్టి, మంత్రంపై అక్షర దృష్టి కూడదు.

💎రామాయణం యజ్ఞం, అది చదివితేనే యజ్ఞ ఫలితం.

💎మంత్రం అనగా దేవతని స్పందింప చేసేది, దేవత యొక్క శబ్ద రూపం. మంత్రం చేసేటప్పుడు ఆ మంత్రదేవత అక్కడ ఉందనే భావనతో ధ్యానించాలి.

💎పురాణాలు తత్త్వ, యజ్ఞ, మంత్ర, యోగ సంకేతాలు, మహర్షులు రహస్యంగా చెప్తారు. ఒక్కొక్క కథనీ బహు శాస్త్రములతో పరిశీలించాలి.

💎భారతీయ సంస్కృతిలో వేదం కానిది లేదు. వేదాన్ని సామాన్యులలోకి తీస్కురావడానికి పుట్టినవే ఇతిహాస పురాణాలు.

💎చేసిన దానికి ప్రత్యుపకారం చేయడం సనాతన ధర్మం.

💎ఉత్తములు ఎప్పటికప్పుడు వారిని వారు ఆత్మ పరిశీలన చేస్కుంటారు, అది జీవిత పయనంలో అత్యంత ముఖ్యం, ప్రతీవారికి ఉండాల్సింది.

💎భారతీయ సంస్కృతిలో వేదం కానిది లేదు.వేదాన్ని సామాన్యులలోకి తీసుకురావడానికి పుట్టినవే ఇతిహాస పురాణాలు.

💎విద్య అనేది వ్యక్తిత్వ నిర్మాణానికి ఉపయోగపడాలి, అటువంటి నిర్మాణానికి హనుమంతుడు గొప్ప గురువు.

💎జీవితం ఎంతో విలువ అయినది అని చెప్పడం రామాయణం యొక్క ప్రధాన నీతి, దేనికోసమో జీవితం నశింప చేసుకోరాదు.
అనిర్వేద శ్రియోమూలం
అనిర్వేద పరం సుఖం
అనిర్వేదోహి సతతం
సర్వార్ధేషు ప్రవర్తకః

💎హనుమంతుడిని ఆదర్శంగా పెట్టుకోవలి- స్వామీ వివేకానంద.

💎హనుమంతుని వంటి గొప్ప వ్యక్తిత్త్వం ఎన్ని సాహిత్యాలు వెతికినా దొరకదు. ఆయన కార్య సాధనకి, ఉత్తమ వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం.

💎”ఇక మార్గం లేదు” అని జీవితంలో ఎన్నో సార్లు అనిపిస్తుంది, అప్పుడు ధైర్యంగా ఉండి, చిత్తాన్ని భగవదర్పణం చేసుకోగలిగితే భగవంతుడు తప్పక మార్గం చూపుతాడు.

💎స్ఫురణ, అనుకూలత దైవం అని తెలుసుకోవాలి, మన నిర్వాకాలు ఏమీ లేవు.

💎మొత్తం రామాయణంలో సీతమ్మ నేరుగా దిగి వచ్చిన దేవత, పరబ్రహ్మస్వరూపిణి.

💎సీతమ్మజడ పువ్వులు, రామాఫలం, సీతాఫలం ఇలా ఎన్నో, వారు చూసే ప్రకృతిలో సీతమ్మని రామయ్యని తలంచుకుని మురిసిపోయే జాతి, భారత జాతి. సీతారాములు భారతీయుల గుండె చప్పుడు.

💎ఆశ్రయ, అర్పణ భావములే స్త్రీ. భక్తి ఎప్పుడు స్త్రీ భావంతోనే చెప్పబడుతుంది.

💎సుఖ దుఃఖాలయందు కూడా ధర్మమునందే నిలవడం గొప్ప జీవితం.

💎హవిస్సులను లాగి అనుగ్రహించే యజ్ఞస్వరూపుడు కనుక “హరి”.

💎అహంకారం భగవంతుడిని ఎత్తుకోలేదు, భక్తి ఒక్కటే భగవంతుడిని ఎత్తుకోగలదు, హనుమంతుడి భుజం మీద శ్రీరాముని ధ్యానించడం అనేది గొప్ప ధ్యానం. అది భక్తి ఎత్తుకున్న భగవంతుడు.

💎మూఢభక్తితో ఆచరించిన కర్మలు సత్ఫలితాలని ఇస్తాయి.

💎పరుల దుఃఖానికి స్పందించడమే కరుణ. మనల్ని ద్వేషించే వాడైనప్పటికీ ఆపదలో ఉన్నప్పుడు రక్షించడమే దయ.అటువంటి దయ(ఆపదలో రక్షణ) సర్వ ప్రాణకోటి పట్ల కలిగి ఉండాలి.

💎ఉపనిషత్తులు ఎప్పుడు ఉపన్యాస విషయాలు కావు, ఉపదేశ విషయాలే.ఉపన్యాస విషయాలు ధర్మము,భక్తి మాత్రమే.

💎భోగానుభవము ఉన్నపుడు విద్య లభించదు, కష్టించి చదివితేనే విద్య లభిస్తుంది.ఏ విద్య సముపార్జించాలన్న భోగలాలసతను పరిత్యజించాలి.

💎సంధ్యావందనం మానేసి, పితృకర్మలు మానేసి,డబ్బుకూడబెట్టుకొని కూర్చునే వారికి ఎప్పుడు నరకద్వారాలు తెరుచుకొనే ఉంటాయి.

💎విద్యార్థికి ఉండవలసినది ఇంద్రియనిగ్రహం.

💎సత్ చిత్ ఆనందం అనే దానిలో-“చిత్” అనే స్వరూపం కృష్ణుడు ,”సత్” అనే స్వరూపం బృందావనం, “ఆనందం” అనే స్వరూపం గోపికలు.

💎సంసారయాత్రలో కలిగే శ్రమనుంచి దూరం చేయగలిగే శక్తి భగవత్కథకు మాత్రమే ఉంది.

💎జ్ఞానం శివమయం శైవిభక్తి: ధ్యానం శివాత్మకం శివార్చన శివవ్రతం శివయోగోహి పంచధా. శివజ్ఞానం,శివభక్తి,శివధ్యానం,శివార్చన,శివవ్రతం .ఈ అయిదు శివయోగాలు.వీటిని పాటించేవాడు “శివయోగి.”

💎విపత్ విస్మరణం విష్ణోః సంపన్నారాయణ స్మృతిః

💎భగవత్ ప్రీతి కలిగితే బ్రతుకు తరిస్తుంది!

💎భగవంతుడిపై అనన్య భక్తి కలిగిన వాడు, అంతా మంచే జరుగుతుందని అనుకోడు, జరిగేదంత మంచి అని అనుకుంటాడు.

💎స్వచ్ఛమైన వ్యక్తిత్వం లేనివాడు స్వచ్ఛమైన పాలన ఇవ్వలేడు.

💎అఙ్ఞానమనే మహారణ్యము వంటి సంసారములో చిక్కుకుని బయటపడే మార్గము తెలియని వారికి, సంసారదావాగ్నితో గూడి, త్రితాపములతో దహింపబడుతున్న ఆర్తులకు, స్వస్వరూపమైన ఆత్మవిద్యను ఉపదేశించి పరమమైన శాంతస్థితిని ప్రసాదించడానికి మౌనముగా మర్రిచెట్టు మొదలులో ఆసీనుడైన శంభుని యొక్క శ్రీ దక్షిణామూర్తి రూపమే, మౌనముద్రను, మర్రిచెట్టు మొదలను విడిచిపెట్టి, శంకరాచార్యుల రూపంలో దిగివచ్చి (అవతరించి) ఈ భూలోకంలో నడయాడినది.

💎తోచింది నమ్మితే “విశ్వాసం” శాస్త్రం చెప్పింది నమ్మితే “శ్రద్ధ”, శాస్త్రం అనగ “ఋషుల అనుభవము”.

💎అంతటా భగవంతుడే ఉన్నాడని ఎవరైతే నమ్ముతారో, నమ్మిన వాడిని భగవంతుడు అన్నిట్లోనించి రక్షిస్తాడు.

💎లోకక్షేమం కోసం వీలైనంత రామాయణ,భాగవత ప్రవాహాలు సాగాలి. అప్పుడు లోకం క్షేమంగా ఉంటుంది,మనం సుఖంగా ఉంటాము.

💎రోగం తగ్గడానికి మందు ఎంత అవసరమో ,మందు పనిచేయడానికి పథ్యం అంత అవసరము. ఔషధానికీ పథ్యం ,అనుష్ఠానానికి ఆచారం.

💎ఎవడు శుద్దుడో వాడి చేత రామ కథ వ్రాయిస్తుంది సరస్వతి దేవి.

💎వ్యక్తి సౌఖ్యాల కంటే ధర్మం శాశ్వతం.దాని కోసం తన సుఖాలనైనా త్యాగం చేసి ధర్మ భద్ధ జీవనాన్ని గడపాలి.ఇది రామచరిత్ర చేసే జీవన బోధ.

💎అందని వాడు కూడ అందుబాటులోకి వస్తాడు నీకు భక్తి ఉంటె.

💎“రసం” అనగా నిరంతర బ్రహ్మానుభవం, “రసో వై సహ”!-అమ్మా! సదా నా మనసు నీ “రసం” లో ముంచు,నా చిత్తము నీ వశం లో ఉంచు.

💎గురువు దగ్గర నిష్కపటంగా ఉండాలి.

💎ఓర్పు ఉంటే దేహానికి బలమైన కవచం ఉన్నట్లే! కోపం ఉంటే శతృవులున్నట్లే. పూజ్య గురువులు ఎన్నో సార్లు ప్రవచనాలలో చెప్పారు, మనలోని negative thoughts అన్నీ కలిస్తే అదే భండాసురుడు. అవి చిన్న స్థాయిలో ఉంటే భండాసురుడి సైన్యం. మనలోని కోపం , ఆవెశం ఇవి అన్ని అధిగమించే శక్తిని ప్రసాదించమని అమ్మను వేడుకుంటే ఆవిడ తప్పక మనల్ని అనుగ్రహిస్తుంది.ఓర్పు, సహనాన్ని ప్రసాదిస్తుంది.

💎నువ్వు నమ్మిన దైవం విగ్రహం కాదని నువ్వు నమ్మితే, ఆ విగ్రహములోని దైవం నిన్ను చూసి తప్పకుండ నవ్వుతుంది.

💎సీత-రామ కళ్యాణం సర్వలోకానికి కళ్యాణం. .

💎”ఇది” అని దేనిని చుపిస్తావో అది లౌకిక వస్తువు.”ఇది” అని దేనిని చూపించలేవో/చెప్పలేవో ‘అది’ పరమాత్మా.

💎భగవంతుడిని నమ్మిన వారికి ఓటమి లేదు.

💎దానం వల్ల అవతలి వాడు ప్రయోజనం పొందుతాడు. అర్పణం వల్ల నువ్వు ధన్యుడివి అవుతావు.

💎రామాయణము, మొదటి సారి వింటే పాప నాశనం, రెండో సారి వింటే పౌండరీక యాగం చేసిన ఫలితం, మూడో సారి వింటే అశ్వమేధ యాగం చేసిన ఫలితం,చివరికి ఆత్మ జ్ఞాన ప్రాప్తి కూడా లభిస్తుంది. దీని బట్టి రామాయణం జీవితమంతా అధ్యయనం చేసే గ్రంధం అని తెలుస్తుంది.

💎రాముడు యజ్ఞస్వరూపుడు అయితే సీతమ్మ వేదం. వేదము లేకపోతె యజ్ఞము లేదు. సీతమ్మ లేకపోతే రాముడు లేడు.రామకథ స్మరిస్తే కలి బాధ నిన్ను బాధించదు.

💎రామ దయ కలిగితే శోకం,మోహం,సందేహం,భ్రమ- ఈ నాలుగు దోషాలు పోతాయి.

💎ప్రపంచంలో వైజ్ఞానిక శక్తి ఉన్న మతం ఒక హిందు మతం మాత్రమే.

💎కోటి జన్మల పుణ్యం ఉంటే శివునిపై భక్తి కలుగుతుంది- మహాభారతం లో కృష్ణ పరమాత్మ వాక్యం.

💎పరిపూర్ణమైన ఆదర్శవంతుడిని మనం ఆదర్శంగా తీసుకుంటే మన జీవితం పరిపూర్ణం అవుతుంది.

💎అహంకారం అరగదీయటమే ఆధ్యాత్మిక సాధనా !

💎నాకు అన్నీ తెలుసు అని అన్నాడంటే కావాల్సినంత అజ్ఞానం ఉందని అర్ధం.

💎ఇంద్రీయాలతో తెలియ బడే విద్యా “అపరా” విద్య ; ఇంద్రీయాలకు అతీతం గ తెలియ బడే విద్య “పరా” విద్య !

💎దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి,ఒంట్లో ఓపిక ఉండగానే దైవ నామస్మరణ చేయాలి, బ్రతికుండగానే నలుగురికి మంచి చేయాలి.

💎మానవుడయినవాడు గురువులను ఆశ్రయించాలి. తల్లి తండ్రులను దేవతామూర్తులుగా పూజించాలి.

💎ఇవ్వబడిన రెండింటి మధ్య నుండి వెళ్ళరాదు:అగ్ని-శివలింగం, సూర్య-చంద్ర ప్రతిమలు, శంకరుడు-నంది, బ్రాహ్మణుడు-అగ్నిహోత్రం, భార్య-భర్త, స్వామి-స్వామిని , ఆవు-బ్రాహ్మణుడు, గుఱ్ఱము-వృషభము , రెండు, అగ్నిహోత్రములు, ఇద్దరు బ్రాహ్మణులు.

💎ముందుగా శిష్యత్వ లక్షణాలను సంపాదించుకుంటే మనం చూసే ప్రపంచం గురువుగా గోచరిస్తుంది. శ్రద్ధ,ఏకాగ్రత,పరిశీలన స్వభావం,నేర్చుకొనే జిజ్ఞాస,వినయం-ఇవి శిష్యలక్షణాలు ఇవి ఉన్నప్పుడు ప్రపంచమే గురువై కనిపిస్తుంది. అలా క్రమంగా మనల్ని హెచ్చరించే మనలోని ఆత్మచైతన్యమే గురువని తెలుస్తుంది.

💎తల్లితండ్రులు సకల పురుషార్ధముల సాధనకు మూలమైన దేహమునకు జన్మనిచ్చి పోషించెదరు. కావున, మానవుడు వంద ఏళ్ళ జీవితమంతా సేవ చేసిన వారిద్దరి ఋణం తీరదు.

💎మోక్షం పొందడానికి అనువైన సాధన పూర్తి అయ్యేవరకు ఆయుష్షు ఉండాలని కోరుకోవాలి.సాధన సగంలో ఆగిపోతే మళ్ళి జన్మ పరంపరలో పడాల్సివస్తుంది.కనుక పొందవలసినది పొందేవరకూ బ్రతకాలి కాబట్టి “దీర్ఘాయురస్తు” అంటారు.

💎సత్పురుషులు గంగ,యమున,సరస్వతి వంటివారు.వాటిలో మునిగితే పుణ్యం వస్తుంది,సత్పురుషుల దగ్గరకు వస్తే మనం తరిస్తాం.

💎సూర్యచంద్రులతో పుట్టిన హిందు ధర్మం ,సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఉంటుంది.